MMR GROUP No Comments

ఆకలి, అవమానం నుంచి వచ్చిన కసి.. 20 కంపెనీలకు అధిపతిని చేసింది..!!

 యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు

కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని దూరం చేసుకునేందుకు కసితో చదివాడు. అయినా కొలువురాలేదు. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు కూలీ అవతారం ఎత్తాడు. కాలం కలిసొచ్చింది. పట్టిందల్లా బంగారమైంది. కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితి నుంచి నేడు 20 కంపెనీలకు ఛైర్మన్ అయ్యాడు. వేల మందికి ఉపాధి కల్పిస్తూ పేదరికంలో మగ్గుతున్న యువతకు బాసటగా నిలిచాడు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న మధుసూదన్ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు.

తండ్రి వెట్టి కూలీ. తల్లి పొగాకు ఫ్యాక్టరీలో దినసరి కూలీ. రోజూ 18గంటలు పనిచేసినా పిల్లల కడుపు నింపడం వాళ్లకు గగనమైపోయేది. అమ్మానాన్న పనికి వెళ్లలేదంటే ఆ రోజు కుటుంబమంతా పస్తులతో పడుకోవాల్సిందే. ఇంట్లో మొత్తం పది మంది. 8 మంది పిల్లల్లో మధుసూదన్ రావు ఎనిమిదో సంతానం. కడుపు నిండా తిండి, కట్టుకునేందుకు మంచి బట్టలు, కాళ్లకు చెప్పులు వారికి కలలో మాత్రమే కనిపించేవి.

గుడిసె వారి ఆవాసం. గ్రామంలో చాలా మందికి పక్కా ఇళ్లున్నా తన కుటుంబం మాత్రం గుడిసెలో ఎందుకుంటుందో చిన్నప్పుడు మధుసూదన్ కు అర్థమయ్యేది కాదు. ఉదయం నిద్ర లేచే సమయానికి అమ్మానాన్న ఇంట్లో కనిపించేవారు కాదు. రాత్రి నిద్రపోయాక వాళ్లు తిరిగొచ్చేవారు. ఎప్పుడో ఒకసారి వారిని చూసే అవకాశం దొరికేది. దీంతో అసలు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారన్న ప్రశ్న కూడా అతన్ని వేధించేది. వయసు పెరిగేకొద్దీ ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. తాము దళితులమని, తండ్రి ఓ భూస్వామి దగ్గర వెట్టి చాకిరీ చేస్తాడని, కుటుంబ పోషణ కోసం తల్లితో పాటు పెద్దక్క కూడా పొగాకు ఫ్యాక్టరీలో పనికెళ్తుందని తెలుసుకున్నాడు.

దళితులు కావడంతో గ్రామస్థులు మధుసూదన్ కుటుంబసభ్యులతో దుర్మార్గంగా వ్యవహరించే వారు. మోకాళ్లపై నిలబడి రెండు చేతులు చాచి అడిగితే తాగేందుకు నీళ్లిచ్చే వారు. దళితులెవరూ మోకాళ్ల కిందకు పంచె కట్టకూడదు. మహిళలు జాకెట్లు కూడా వేసుకోకూడదు. దళితుల నీడ తాకడం కూడా గ్రామస్థులు అపశకునంగా భావించేవారు. పొరపాటున ఎవరినైనా ముట్టుకుంటే శిక్ష అనుభవించాల్సిందే. ఇన్ని కష్టాలు, కట్టుబాట్ల మధ్య పెరిగిన మధుసూదన్ కు పెద్ద చదువులు చదివి పట్నంలో ఉద్యోగం చేస్తే పేదరికం, వెట్టి చాకిరీ నుంచి కుటుంబానికి విముక్తి కల్పించవచ్చన్న విషయం అర్థమైంది. అందుకే శ్రద్ధగా చదివాడు.

ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొని గొప్ప పారిశ్రామికవేత్త పేరుతెచ్చుకున్న మధుసూదన్ రావ్ తన జీవిత ప్రస్థానానికి సంబంధించి ఎన్నో విషయాలను ప్రత్యేకంగా యువర్ స్టోరీతో పంచుకున్నారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకాలోని పాలకూరు మధుసూదన్ రావు స్వస్థలం. తండ్రి పేరు పేరయ్య. తల్లి రాములమ్మ. మధుసూదన్ చిన్నతనంలో తల్లిదండ్రుల్ని చూసింది చాలా తక్కువ. పిల్లల కడుపు నింపే ప్రయత్నంలో కోడి కూయకముందే పనుల్లోకి వెళ్లి ఏ అర్థరాత్రో ఇంటికి తిరిగొచ్చే అమ్మానాన్నలతో ప్రేమగా గడిపిన సందర్భాలు లేవనే చెప్పాలి. తండ్రి ఓ భూస్వామి దగ్గర పని చేసేవాడు. వారసత్వంగా ఆస్తులు వచ్చినట్లు.. వీరి కుటుంబానికి వెట్టి చాకిరీ వారసత్వంగా వచ్చింది. మధుసూదన్ తాత, ముత్తాత కూడా ఆ భూస్వామి కుటుంబం దగ్గరే పనిచేసేవారట. వాళ్లు విదిల్చే డబ్బు కోసం ఏకబిగిన 18 గంటల పాటు పొలం పనులు చేయడం, పశువుల్ని మేపడం, ఇంటెడు చాకిరీ చేయాల్సి వచ్చేది. పనికెళ్లిన రోజు పైసలు.. లేకపోతే పస్తులు. వేన్నీళ్లకు తోడు చన్నీళ్లలా అమ్మ, అక్క రోజూ 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఫ్యాక్టరీలో పనిచేసే వచ్చేవారు. ఇంత కష్టపడుతున్నా అప్పుడప్పుడు పస్తులతో పడుకోవాల్సి వచ్చేది. ఆకలితో పేగులు మెలికపడేవి. పౌష్టికాహారం లేక శరీర భాగాలను బాధించే నొప్పులు ఇప్పటికీ గుర్తొస్తాయంటారు మధుసూదన్ రావ్.

పూట గడవడమే కష్టంగా ఉన్నా కనీసం ఇద్దరు పిల్లలనైనా చదివించాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. మొదట మధుసూదన్ అన్న మాధవ్ ను స్కూల్ లో చేర్చారు. ఆ తర్వాత మధు వంతు వచ్చింది. ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ అయ్యారు. శ్రద్ధగా చదువుకోవడంతో పరీక్షల్లో ఎప్పుడూ మంచి మార్కులొచ్చేవి. మధుసూదన్ ఇంటికి దగ్గరలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ లక్ష్మీ నర్సయ్య రాకతో వారి జీవితాలు కొత్త మలుపు తిరిగాయి. ఉచితంగా చదువు, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామనడంతో తండ్రి వారిని హాస్టల్ లో చేర్చేందుకు సరేనన్నాడు. అలా అన్నదమ్ములిద్దరూ సంక్షేమ హాస్టల్ లో చేరారు.

అక్కడ కడుపునిండా భోజనం పెట్టేవారు. అన్నం బాగోలేకపోయినా ఎలాగోలా తినేవారు. ఒక్క భోజనం తప్ప మిగతా అన్ని విషయంల్లో హాస్టల్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. హాస్టల్ వార్డెన్ లక్ష్మీ నర్సయ్య, టీచర్ జేకే- ఈ అన్నదమ్ములిద్దరికీ ఎంతో సాయం చేశారు. ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకోవాలంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి ఆశల్ని మధుసూదన్ ఏనాడు వమ్ము చేయలేదు. క్లాస్ లో ఎప్పుడూ టాప్ 5లో ఉండేవాడు. సెకండ్, థర్డ్ ర్యాంక్ అలా వచ్చేవి.

సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో ఉంటూనే మధుసూదన్ ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. అన్న మాధవ్ అప్పటికే బీటెక్ లో జాయిన్ అయ్యాడు. మధుసూదన్ కు కూడా బీటెక్ చేయాలని ఉన్నా.. అన్న, ఇతర మిత్రుల సలహా మేరకు పాలిటెక్నిక్ లో చేరాడు. అప్పట్లో పాలిటెక్నిక్ కోర్సు పూర్తైతే తప్పక ఉద్యోగం వస్తుందన్న గట్టి నమ్మకం ఉండేది. ఆ విశ్వాసంతోనే మధుసూదన్ ఆ కోర్సు ఎంచుకున్నాడు. ఎంట్రెన్స్ టెస్ట్ లో మంచి ర్యాంకు రావడంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సీటు వచ్చింది. రెండేళ్ల పాటు తిరుపతి, ఫైనల్ ఇయర్ ఒంగోలులో చదివి డిప్లొమా పట్టా అందుకున్నాడు.

మధుసూదన్ డిప్లొమా పూర్తి కాగానే అతని కుటుంబ సభ్యుల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. మధుకు మంచి ఉద్యోగం వచ్చి నాలుగు డబ్బులు వచ్చి తమ దరిద్రం దూరమవుతుందని తల్లిదండ్రులు అన్నా చెల్లెళ్లు ఆశపడ్డారు. మంచి ఉద్యోగం సాధించమని మధుపై ఒత్తిడి తెచ్చారు. ఉద్యోగం కోసం ఎన్ని అర్జీలు పెట్టుకున్నా, ఆఫీసుల చుట్టు కాళ్లరిగేలా తిరిగినా ఫలితంలేకుండా పోయింది. ఎన్ని ప్రయత్నాలుచేసినా జాబ్ దొరకలేదు. ఇంట్లో వాళ్లంతా తనపై పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా అడియాసలయ్యాయి. పాలిటెక్నిక్ తర్వాత ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకకపోవడానికి కారణం రిఫరెన్స్ లేకపోవడమే అంటారు మధుసూదన్.

“ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా అక్కడ రిఫరెన్స్ అడిగేవారు. కానీ నాకు రిఫరెన్స్ ఇచ్చేందుకు ఎవరూ లేరు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వాడినవడం కూడా నన్ను రిజెక్ట్ చేసేందుకు మరో కారణం. కుటుంబంలో అందరూ నిరక్ష్యరాస్యులే అన్న సాకుతో చాలా కంపెనీలు ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించాయి. ఏం చేయాలో అర్థంకాలేదు. ఖాళీగా కూర్చోలేను. డిప్లొమా కంప్లీట్ కాగానే మంచి ఉద్యోగం వస్తుందన్న కుటుంబసభ్యుల ఆశ నిరాశైంది. ఏ పని చేసైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నా.”

డిప్లొమా కంప్లీట్ చేసిన మధుసూదన్ మిగతా తోబుట్టువులతో కలిసి కూలీ పనులకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరుల్లో ఒకరు హైదరాబాద్ లో మేస్త్రీ పని చేసేవాడు. మధు అతని దగ్గరే కూలీగా మారాడు. భవన నిర్మాణ కూలీగా మారి మట్టి తట్టలు మోశాడు. రాళ్లు ఎత్తాడు. గోడలకు నీళ్లు కొట్టాడు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే 50 రూపాయలు ఇచ్చేవారు. రాత్రిళ్లు పనిచేస్తే 120 రూపాయలు ఇస్తారన్న విషయం తెలిసింది. దాంతో రాత్రివేళల్లో కూడా పనికెళ్లడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల పాటు వాచ్ మెన్ గానూ పనిచేశాడు.

నీతి, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వమే తనకు జీవితంలో మరో అవకాశం ఇచ్చిందంటారు మధుసూదన్.

“ఓ రోజు టెలిఫోన్ స్తంభం పాతేందుకు గొయ్యి తీస్తుండగా అక్కడికి వచ్చిన ఒక ఇంజనీర్ చదువుకున్నావా అని అడిగారు. పాలిటెక్నిక్ కంప్లీట్ చేశానని చెప్పా. పనిచేసే విధానాన్ని చూసి నువ్వు చదువుకుని ఉంటావనిపించింది అన్నారు. వేరే వాళ్లెవరూ ఇంత నైపుణ్యంతో కొలతలు తీసుకుని సైంటిఫిక్ పద్దతిలో గొయ్యి తొవ్వరు అన్నారు”

మధుసూదన్ పనితీరును మెచ్చిన ఇంజనీర్ ఉద్యోగం ఆఫర్ చేశాడు. ఆ మాట వినగానే మధుసూదన్ లో ఆశ కలిగింది. మధుసూదన్ ను ఆఫీసుకు తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేశాడు. ఆఫీసులో ఓ వైపు ఇంటర్వ్యూ జరుగుతుండగా.. మరోవైపు కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ మధ్య ఓ కాంట్రాక్టు విషయంలో వాగ్వాదం నడుస్తోంది. సబ్ కాంట్రాక్టర్ ఎక్కవ డబ్బు అడుగుతున్నాడు. దీంతో మధుసూదన్ ఆ కాంట్రాక్టు తనకివ్వమని అడిగాడు. పనిచేయించడంలో తాను ఎక్స్ పర్ట్ నని, తన కుటుంబ సభ్యులంతా కష్టపడి పనిచేస్తారని చెప్పి నమ్మకం కలిగించే ప్రయత్నం చేశాడు. అయితే కాంట్రాక్టర్ మాత్రం ముందు ఇంటర్వ్యూ పై దృష్టి పెట్టమన్నాడు. సబ్ కాంట్రాక్టర్ తో డీల్ కుదరకపోవడంతో చివరకు మధుసూదన్ కు ఆ పని అప్పగించాడు. పని దొరికింది. కానీ దాన్ని ప్రారంభించేందుకు కూలీలకు అడ్వాన్స్ ఇవ్వాలి. మధుసూదన్ తన తోబుట్టువులను ఆర్థికసాయం కోరాడు. ఒక అక్క 900 రూపాయలు సర్దింది. ఆ డబ్బులతో కూలీల దగ్గరకెళ్లి, పని పూర్తికాగానే మిగతా డబ్బు ఇస్తానని ఒప్పించాడు. తొలిరోజు 20 వేల రూపాయల ఆదాయం. ఖర్చులు పోనూ చాలా డబ్బే మిగిలింది. ఆ రోజు అక్కతో కలిసి మళ్లీ కడుపునిండా అన్నం తిన్నాడు. ఆ రోజు నుంచి మధుసూదన్ తలరాతే మారిపోయింది. పట్టిందల్లా బంగారమైంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరంలేదు. మధుసూదన్ పనితీరుతో ఇంప్రెస్ అయిన కాంట్రాక్టర్ లక్ష రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా కాంట్రాక్టులు వచ్చాయి. కొన్ని రోజుల్లోనే లక్ష రూపాయలు వెనకేశాడు. మనసు ఊరి పైకి మళ్లింది. అప్పటికే ఊరిలో అడుగుపెట్టి కొన్నేళ్లైంది.

“ఉద్యోగం, సంపాదన లేకపోవడంతో ఇంటికి వెళ్లాలనిపించేది కాదు. సిగ్గుతో చాలాకాలం ఊరి ముఖం చూడలేదు. లక్ష రూపాయలు సంపాదించాక ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అంతకు ముందె నేనెప్పుడూ లక్ష రూపాయలు చూడలేదు. ఊరికెళ్లి అమ్మానాన్న చేతిలో లక్ష రూపాయలు పెట్టగానే వారు ఆశ్చర్య పోయారు. అంత డబ్బు ఒక్కసారి చూసి మొదట నమ్మలేకపోయారు. ఇంత డబ్బు ఎక్కడిది? ఎక్కడి నుంచి తెచ్చావ్? ఏం చేసి సంపాదించావ్? అని ఆశ్చర్యంతో అడిగారు.”

ఆ డబ్బుతోనే మధుసూదన్ చెల్లి పెళ్లి చేశాడు. పెళ్లైపోయాక హైదరాబాద్ తిరిగొచ్చ  క్షణం తీరిక లేకుండా అయ్యాడు. కాంట్రాక్టులు పెరిగాయి. ఆదాయం పెరిగింది. జీవితం సాఫీగా సాగుతోంది. పేదరికం దూరమైంది. అనుకున్నట్లు సాగితే అది జీవితం ఎందుకవుతుంది? మధుసూదన్ మళ్లీ కష్టాల్లో పడ్డాడు. ఈసారి ఓ వ్యక్తిని నమ్మి మోసపోయాడు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్మంతా రెప్పపాటులో మాయమైంది. ఈ ఘటన ఆయనను తీవ్రంగా కలిచివేసింది.

“నమ్మిన వ్యక్తులు నట్టేట ముంచారు. నమ్మక ద్రోహం చేశారు. వెన్నుపోటు పొడిచారు. కొందరు స్నేహితులు ప్రోద్బలంతో కంపెనీ ప్రారంభించా. కంపెనీ బాగానే నడిచింది. అయితే భాగస్వాములు మోసం చేశారు. నా సంపాదననంతా దోచేశారు.”

మధుసూదన్ ఎలా మోసపోయారన్న విషయం గురించి పూర్తిగా చెప్పకపోయినా.. ఈ ఘటన తనకు జీవితంలో గొప్ప గుణపాఠం నేర్పిందంటారు. అలాంటి పరిస్థితి ఎదురుకావడంతో ఒక రకంగా తనకు మంచే జరిగిందని అంటారు మధుసూదన్. అయితే పార్ట్ నర్లు చేసిన మోసం ఆయనను ఎంతగా బాధించిందంటే.. కాంట్రాక్టులు, వ్యాపారం గట్రా వదిలేసి ఉద్యోగం చేయడమే మంచిదన్న నిర్ణయానికొచ్చాడు. ఓ ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అదే సమయంలో మధుసూదన్ కు పెళ్లైంది.

మధుసూదన్ భార్యకు బిజినెస్ లో జరిగిన మోసం గురించి ముందే తెలుసు. దీంతో ఆమె మధుసూదన్ మళ్లీ వ్యాపారం జోలికి వెళ్లకుండా ఉద్యోగం చేయాలని షరతు పెట్టింది. అందుకు ఆయన అంగీకరించాడు. అయినా మనసు మాత్రం వ్యాపారం వైపు లాగేది. ఆయనకు తనలో గొప్ప వ్యాపారవేత్త దాగి ఉన్నాడని అనిపించేది. ఏ రంగంలోనైనా సక్సెస్ సాధించేందుకు అవసరమైన అన్ని గుణాలు తనలో ఉన్నాయని, ఉద్యోగం చేస్తూ సమయం వృధా చేసుకుంటున్నాన్న భావన కలిగేది. దీంతో మధుసూదన్ భార్యతో చెప్పకుండా కంపెనీ ప్రారంభించాడు. ఆదాయం కూడా బాగానే వచ్చింది. ఓ రోజు ఇంటికొచ్చిన లెటర్ తో మధుసూదన్ బిజినెస్ చేస్తున్న విషయం భార్యకు తెలిసింది. ఆమె కోపంతో ఊగిపోయింది. వ్యాపారం మాని ఉద్యోగంపై మనసు పెట్టాలని గట్టిగానే చెప్పింది. అప్పటికి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అయినా ఆదాయం 30-35 వేలు దాటేదికాదు. అదే బిజనెస్ చేస్తే కనీసం 3 లక్షలు సంపాదించొచ్చని, ఇద్దరూ ఏడాది పాటు ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బు నెల రోజుల్లోనే సంపాదించొచ్చని నచ్చజెప్పాడంతో ఆమె శాంతించింది.

“ప్రతి విషయంలోనూ నా భార్య అండగా నిలిచింది. ఆమె నా జీవిత భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆమె కారణంగానే జీవితం ఆనందమయమైంది. ఆమే నా బలం”

భార్య ప్రోత్సాహంతో వ్యాపారంలో మరిన్ని మైలు రాళ్లు దాటిన మధుసూదన్ ఎంతో మందికి రోల్ మోడల్ అయ్యారు. MMR గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో టెలికాం, ఐటీ, ఎలక్రికల్, మెకానికల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఇప్పటికి 20 కంపెనీలు పెట్టి సక్సెస్ ఫుల్ ఆంట్రప్రెన్యూర్ గా పేరు తెచ్చుకున్నారు. వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న మధుసూదన్ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు.

20 కంపెనీలను మేనేజ్ చేయడం ఏమంత పెద్ద కష్టం కాదంటారు మధుసూదన్. తన కుటుంబ సభ్యులంతా వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటారని, ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతను భుజాన వేసుకుని అవసరమైన సాయం చేస్తారని అంటున్నారు.

“ప్రతి విషయంలోనూ ఎక్స్ పర్ట్ అయిన వారిని కంపెనీ హెడ్ లుగా నియమించా. ఎవరి పనులు వారు చక్కగా చేసుకుంటారు. ప్రతిరోజూ అన్ని కంపెనీల హెడ్స్ తో మాట్లాడుతాను. అవకాశాల కోసం వెతుకుతూనే ఉంటాను. అవకాశం దొరికిన వెంటనే అందిపుచ్చుకుంటాను.”

టైం మేనేజ్ మెంట్ పెద్ద సమస్యే కాదనే మధుసూదన్. ఈ విషయంలో తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి అని చెబుతారు.

“వాళ్లు రోజులో 18 గంటల పాటు పనిచేసేవారు. వాళ్లలాగే నేను కూడా రోజూ 18 గంటలు పనిచేస్తాను. మా కంపెనీల్లో ప్రతి ఉద్యోగి కూడా మనసుపెట్టి పని చేస్తాడు. ఇన్ని గంటలు మాత్రమే పనిచేస్తానని ఎవరూ చెప్పరు. టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు అలుపెరగకుండా వర్క్ చేస్తారు” అని తన ఉద్యోగుల గురించి గర్వంగా చెప్పుకుంటారు మధుసూదన్

బతికున్నంత వరకు తల్లిదండ్రులే తనకు ఆదర్శం అని చెప్పుకునే మధుసూదన్ రావు.. వారిచ్చిన ప్రేరణతోనే సమస్యల నుంచి బయటపడటం నేర్చుకున్నానని అంటారు.

“అమ్మానాన్నలు పడ్డ కష్టాల ముందు నావి అసలు కష్టాలే కాదనిపిస్తుంది. వాళ్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొని వాటి నుంచి బయటపడ్డారు. ఎప్పుడైనా సమస్య ఎదురైతే అమ్మానాన్నని గుర్తుచేసుకుంటాను.”

మేన్, మెటీరియల్, మనీ ఈ మూడింటిని సమర్థంగా వినియోగించుకోవడమే తన సక్సెస్ సీక్రెట్ అంటారు మధుసూదన్. కడుపేదరికం నుంచి బయటపడి కోటీశ్వరుడిగా మారినా.. నడిచివచ్చిన దారిని ఎన్నిటికీ మర్చిపోను అని మధుసూదన్ అంటారు. ఆయన ప్రస్తుత కల, లక్ష్యం ఒక్కటే. అదే రానున్న ఐదారేళ్లలో గ్రామీణ ప్రాంత యువతకు మంచి ఉద్యోగం వచ్చేలా లేదా వ్యాపారవేత్తలుగా రాణించేలా శిక్షణ ఇవ్వడం. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినందున అక్కడి యువత, విద్యార్థుల కష్టాలు, సమస్యలు ఆయనకు బాగా తెలుసు. వాస్తవానికి గ్రామీణ ప్రాంత యువత ఎదుర్కొంటున్న పెద్ద సమస్య కమ్యూనికేషన్ ప్రాబ్లం. వాళ్లలో నైపుణ్యాలను పెంచి వచ్చే ఐదేళ్లలో కనీసం ఐదు వేల మంది యువతీయువకుల్ని వ్యాపారవేత్తలుగా లేదా ఉన్నతోద్యోగం పొందేందుకు అవసరమైన అర్హతలు సాధించేలా తీర్చిదిద్దాలన్నదే మధుసూదన్ రావు లక్ష్యం.

తాను అనుభవించిన కష్టాలు భవిష్యత్ తరాలు పడకూడని కోరుకునే ఆయన గ్రామాల్లో పేదరికమన్నదే కనిపించకుండా చేయాలని కోరుకుంటున్నారు. కుటుంబంలో ఒక్కరు ఉద్యోగం చేసినా ఆ ఫ్యామిలీ మొత్తం సంతోషాలకు నిలయంగా మారుతుందన్నది ఆయన విశ్వాసం. ఒకప్పుడు గుడిసెలో ఉండే తన కుటుంబం ఇప్పుడు పక్కా ఇంటిలో ఉంటోందంటే అందుకు కారణం ఉద్యోగం, వ్యాపారమే అంటారు మధుసూదన్ రావు. అందుకే తన కుటుంబంలో 65 మంది ఏదో ఒక పని చేసేలా ప్రోత్సహిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి పేదరికాన్ని పారదోలేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయడమే మధుసూదన్ రావు ఆశయం. ఆయన కల నెరవేరాలని యువర్ స్టోరీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

https://telugu.yourstory.com/read/408e7c23d8/hunger-indignity-came-from-the-head-of-the-companies-that-made-the-csi-20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *