Korada.com
From Coolie to Entrepreneur Inspiring Success Story
తాపీ కూలీగా, వాచ్ మెన్ గా, కేబుళ్ల కోసం గుంతలు తవ్వే కూలీలా జీవితాన్ని ఆరంభించిన ఓ 22 ఏళ్ల కుర్రాడు.. తానో వంద కోట్ల టర్నోవర్ చేసే కంపెనీకి ఛైర్మన్ అవుతానని ఊహించగలడా? మారుమూల పల్లెల్లో రెండు గ్లాసుల దురవస్థను అనుభవించిన ఆ యువకుడు.. ఇప్పుడు సమాజంలో ఓ ఉన్నతమైన స్థానానికి చేరుకోగలడని విశ్వసించగలడా ? సాధారణంగా అయితే ఇది సినిమాల్లో మాత్రమే నిజమవుతుంది. ఓ పాట అయిపోయేలోపు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో హీరో పూరి గుడిసె నుంచి బంగళాలోకి మారిపోతాడు. కానీ రియల్ లైఫ్‌లో ఇలాంటి ఘటనలు అసాధ్యమే.. అయినా అక్కడక్కడా.. తారసపడొచ్చు. మీరు ఇప్పుడు చదవబోయేది కూడా అలాంటి కథనమే. కేవలం డిప్లమా చదివిన వ్యక్తి.. అష్టకష్టాలు పడి.. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం గుర్తించే స్థాయికి ఎదిగాడు. రూపాయి రూపాయి పోగేస్తూ.. కష్టాన్ని నమ్ముకుని.. ఒక్కో ఇటుకతో కలల సౌధాన్ని నిర్మించుకున్నాడు. అతనే మన్నెం మధుసూధన్ రావు. MMR Group ఛైర్మన్. ఓ కుగ్రామం నుంచి వచ్చి కార్పొరేట్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సక్సెస్‌ఫుల్ అండ్ ఇన్‌స్పైరింగ్ ఆంట్రప్రెన్యూర్.
మధుసూధన్ రావుది.. ప్రకాశం జిల్లా.. కందుకూరులోని పాలుకూరు గ్రామం. తండ్రి పేరయ్య, తల్లిరాములమ్మకు పుట్టిన ఎనిమిది మంది సంతానంతో ఐదోవాడు ఇతను. ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉండేది.. వీళ్ల పూరిగుడిసె. మగాళ్లెవరూ మోకాళ్లను దాటి పంచెను కిందికి కట్టకూడదు.. ‘ఏరా.. ఓరేయ్.. ఒసేయ్.. ఇవీ’.. వీళ్లకు ఊరిజనాలు ఇచ్చిన పేర్లు. తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిందేమైనా ఉందీ.. అంటే.. అది పేదరికం, పాలేరు పని, తాపీపని.. తల్లి పొగాకు గ్రేడింగ్ కూలీ. ఇంట్లో అంతా పనిచేస్తే తప్ప.. పూటగడవని స్థితి. ముప్పుటలా తాగేది, తినేది.. గంజి, జొన్న సంగటి మాత్రమే. అలాంటి వాతావరణంలో పుట్టిపెరిగాడు మధుసూధన్. ఆరవ తరగతి వరకూ ఊళ్లోనే చదువు. అంత మందిని సాకడం.. ఆ తండ్రికి భారమైంది. ఇంట్లో నలుగురు ఆడపిల్లలు. అయినా సరే.. ఇద్దరు కొడుకులనైనా కనీసం చదివించాలనే కోరిక తల్లిదండ్రులది. అందుకే ఇంట్లో మిగిలిన ఎనిమిది మందీ.. చేసిన త్యాగం మధుసూధన్‌ను.. అతని అన్న మాధవ్‌ను చదివేలా చేసింది. ఇంట్లో తిండికి కూడా ఇబ్బందికావడంతో అన్నాదమ్ముల మకాం సంక్షేమ హాస్టళ్లకు మారింది. అక్కడైనా ముప్పూటలా తిండి దొరుకుతుందన్న వీళ్ల ఆశ అడియాసే అయింది. ప్లేట్లో మజ్జిగ పోసుకుంటే.. పురుగులన్నీ బయటకు తేలేవంటూ అప్పట్లో తన దుర్భర జీవితాన్ని గుర్తుచేసుకున్నారు మధుసూధన్. వేరే గత్యంతరం లేక అక్కడే చదువుతూ టెన్త్, ఇంటర్‌లో ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ఆ తర్వాత బిటెక్ చేసే అవకాశం వచ్చినా.. ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. అన్న అప్పటికే బిటెక్ చుదువుతుండడంతో తాను ఆ అవకాశాన్ని వదులుకుని పాలిటెక్నిక్ చేరాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.
తాపీ చేతపట్టాల్సి వచ్చింది
పాలిటెక్నిక్, బిటెక్ అయిపోయి.. హైదరాబాద్ రాగానే.. ఉద్యోగం కన్ఫర్మ్ అని అన్నాదమ్ములు అనుకున్నారు. కానీ అదంత సులువు కాదని అప్పుడే అర్థమైంది. అలా అని ఊరు వెళ్లలేని పరిస్థితి. కొడుకులు ఇద్దరూ పట్నం పోయి ఏదో ఒకటి సంపాదించి అందరినీ ఆదుకుంటారని అక్కడ వాళ్లంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక్కడేమో ఉద్యోగం దొరకని స్థితి. రోజులు గడుస్తున్నాయి.. చేసేది లేక ఇక్కడే కూకట్‌పల్లిలో నిర్మాణ కూలీగా ఉన్న అక్కాబావల దగ్గరికి వచ్చారు. ఆ ఇంట్లో సరిగ్గా ఇద్దరు కూడా కూర్చోలేరు.. ఒకరు పడుకోలేరు. అలాంటి దీనస్థితి వాళ్లది. ఎలాగోలా వాళ్లను ఒప్పించి కొద్దిరోజులు అక్కడే ఉండి కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. ఫలితమేదీ లేదు. చేసేది లేక తమకు వచ్చిన తాపీ పనిలో దిగారు. అక్కాబావతో కలిసి కూలీకి వెళ్లి రోజుకింత సంపాదించుకున్నారు. చదివింది బిటెక్, పాలిటెక్నిక్ అయినా.. మొహమాట పడలేదు. తమ గురించి ఊళ్లో ఎదురుచూస్తున్న కుటుంబానికి ఎంతో కొంత ఇక్కడి నుంచి పంపించాలనే తపనే వాళ్లలో కనిపించింది. అలా తన ప్రస్థానం తాపీ కూలీగా మొదలైంది. తినడానికి తిండిలేదు. ఉండడానికి జాగాలేదు. నిర్మాణం కోసం పెట్టిన ఇసుకలో సిమెంట్ సంచీలు వేసుకుని రాత్రిళ్లు పడుకున్నాం. రోజులో ఒకే పూట భోజనం. అది కూడా మధ్యాహ్నమే తినేవాడిని ఎందుకంటే.. అప్పుడైతే రాత్రిపూట ఆకలి అంతగా ఉండదని. మే నెల ఎండల్లో చెప్పులు లేకుండా ఎన్నిసార్లు.. ఎన్ని కిలోమీటర్లు నడిచి ఉంటానో లెక్కేలేదు. ఊరికి వెళ్లలేము. ఇక్కడ బతకలేము. ఎలారా భగవంతుడా.. అని గుండెపగిలేలా ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలుసు. ఇప్పటికీ ఆ రోజులు తలుచుకుంటే.. ఏదో తెలియని బాధ, ఆక్రోషం వస్తుంది.” అని అప్పట్లో తన దుర్భర జీవితాన్ని అప్పడప్పుడు గుర్తు చేసుకుంటారు మధు సూదన్ రావ్.
కూలీ కాంట్రాక్టర్
ఒకరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా.. ఓ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లారు ఎంఎంఆర్. అక్కడా నిరాశే. కానీ ఓ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు చెవిన పడడం.. అతని జీవితాన్నే మార్చేస్తాయని అనుకోలేదు. తాము చేస్తున్న టెలికాం కేబుల్ పనికి కూలీలు దొరకడం కష్టంగా ఉందని, దీని వల్ల పనులు బాగా ఆలస్యమవుతున్నాయనేది ఆ మాటల సారాంశం. తమ ఊళ్లో, ఇంటిదగ్గరా.. చాలామంది పనిలేక ఇబ్బంది పడడాన్ని గమనించారు మధుసూధన్. వాళ్లందరినీ తీసుకువచ్చి నేనే ఆ పని ఎందుకు చేయించకూడదు అని అనుకున్నాడు. వాళ్లు ఏమనకుంటారు, అసలు తనను నమ్ముతారో లేదో.. అనే సంశయం ఏదీలేకుండా.. తనకు ఈ పని అప్పగించమని ఆ కంపెనీ ప్రతినిధులను కోరారు. ముక్కూమొహం తెలియని తనకు ఆ పనిని ఇవ్వడం కుదరని వాళ్లూ తెగేసి చెప్పారు. అయినా పదే పదే అడగడంతో సరేనన్నారు. అడ్వాన్స్ ఏమీ ఇవ్వబోమని.. రాత్రికి కూలీలను సైట్‌కు తీసుకువస్తే చూద్దామని చెప్పి పంపించేశారు. జీవితంలో తానేదో పెద్ద ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాననేంత ఆత్మవిశ్వాసం.. ఒకవైపు.. రాత్రికి కూలీలందరినీ అడ్వాన్స్ లేకుండా ఎలా తీసుకురావాలనే ఆందోళన మరోవైపు.
ఇప్పుడా నగరంలో తనకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే.. కేవలం అక్క మాత్రమే. ఆమెను ఓ మూడు వేలు సర్దమని, రాత్రికల్లా పేమెంట్ వచ్చేస్తుందని ఒప్పించే ప్రయత్నం చేశాడు. తమ్ముడిపై నమ్మకంతో.. ఓ పదిమందిని అడిగి కేవలం 900 పట్టుకొచ్చింది వాళ్ల అక్క. అదే తన వ్యాపారానికి మొదటి పెట్టుబడి. ఇక ఆలస్యం చేయకుండా.. ఓ చిన్న వాహనాన్ని అద్దెకు తీసుకుని.. దగ్గర్లో ఉన్న బస్తీలకు వెళ్లి ఓ పదిహేను, ఇరవై మందిని ఎలాగోలా పనికి ఒప్పించాడు. వాళ్లను సైట్‌కు తీసుకువచ్చి రాత్రిపూట భోజనం, టీ ఇప్పించాడు. ఇప్పుడు తన పనేంటంటే.. ఆ కూలీలతో రాత్రిపూట గుంతలు తవ్వించి టెలికాం కేబుళ్లను లాగడం. 100 మీటర్ల ఆ పనికోసం ఆ రాత్రంతా తానూ పనిచేశాడు. స్వతహాగా మెకానికల్ ఇంజనీర్ కావడంతో.. ఆ పనులన్నీ వెంటనే పట్టేశాడు. మొదటి రోజు తాను చేసిన ఆ పనికి మధుసూధన్‌కు వచ్చిన ఆదాయం రూ.20 వేలు. ఖర్చులుపోగా బాగానే మిగిలింది. ఆ రోజే తొలిసారిగా అక్కతో కలిసి కడుపు నిండా భోజనం చేశాడు. చాలాకాలం తర్వాత..!
దశ తిరిగింది
మధు పనితనం నచ్చి.. టాటా టెలీసర్వీసెస్ పనులు చేసే ఓ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ పనులు ఇవ్వడం మొదలుపెట్టాడు. కూలీలను సైట్లను తీసుకువచ్చి వాళ్లతో పనులు చేయించడం ఇతని పని. మెల్లిగా ఒక్కోటి నేర్చుకుంటూ.. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేయింగ్‌లో పూర్తిస్థాయి ప్రావీణ్యత సంపాదించారు. అప్పట్లోనే టాటా సహా.. అనేక టెలికాం కంపెనీల సబ్ కాంట్రాక్ట్ పనులు చేయడం మొదలుపెట్టారు. ఇక వెనక్కి తిరిగి చూసుకునేది లేకుండా.. దూసుకుపోయారు. ‘ఎక్కుతొలిమెట్టు.. కొట్టు.. కొండను ఢీకొట్టు’ అనేంత కాన్ఫిడెన్స్ మధులో కనిపించింది. వందల మంది కార్మికులను ఊళ్లు, పల్లెల్ల నుంచి తీసుకురావడం.. వాళ్ల బాగోగులు చూసుకుని.. వాళ్ల పొట్టకొట్టకుండా న్యాయంగా సంపాదించడం మొదలుపెట్టాడు. అలా 20 వేల కాంట్రాక్టర్ స్థాయి నుంచి రెండేళ్లలోనే రెండు కోట్లకు ఎదిగారు. ఈ లోపు మధు అన్నకు కూడా బిఎస్ఎన్ఎల్‌లో మంచి ఉద్యోగం లభించింది.
విలన్ ఎంట్రీ
కుర్రాడి దూకుడు చూసి.. ఓ వ్యక్తి చేరదీశాడు. నీకున్న కెపాసిటీకి చిన్న ఆర్డర్లేంటి.. నాతో చేయి కలిపితే స్టేట్ మొత్తం దున్నేయొచ్చని నమ్మించాడు. ఇందుకోసం ఓ కంపెనీని ఫ్లోట్ చేద్దామని చెప్పడంతో.. మధు కూడా పూర్తిగా నమ్మేశాడు. అడిగిన చోటల్లా సంతకాలు పెట్టేయడం.. తన డబ్బంతా.. అతడికి అప్పగించడం చేసేశాడు. తీరా ఏడాది తర్వాత.. ఒకసారి డబ్బు అవసరముందని.. వెళ్తే.. కంపెనీ నష్టాల్లో ఉందని.. పైసా కూడా ఇచ్చేది లేదని చెప్పడంతో.. అతని కాళ్ల కింది భూమి కదిలినంత పనైంది. ఇంతకాలం పడిన కష్టం మొత్తం ఒక్కమాటతో చెదిరిపోయింది. ఎక్కువ మాట్లాడితే.. ఏమైనా చేయగలమని బెదిరించాడు. దీంతో ఇంట్లో వాళ్లంతా బాధపడి.. చేసేదిలేక మిన్నకుండిపోయారు. అంగబలం.. అర్థబలం రెండూ లేకపోవడంతో చేసేదిలేక వెనుదిరిగారు.
వాళ్లు చేసిన మోసంతో నేను కోల్పోయిందేమీ లేదు. నా కష్టమే పోయింది. పోతేపోయింది. వయస్సుంది.. తెలివి ఉంది. ఆ మాత్రం సంపాదించుకోలేనా? లేబర్‌కి ఇవ్వాల్సిన డబ్బులంతా సెటిల్ అయిపోయింది. నష్టపోయింది నా లాభమే. ఇది జీవితంలో పెద్ద అనుభవం. అందుకే ఎవరినీ ఊరికే నమ్మసేయొద్దు అనే ఖరీదైన అనుభవం తెలిసొచ్చింది.
మళ్లీ జీరో స్థాయికి
డబ్బూ పోయింది. దీనికి తోడు బెదిరింపులు. ఒక్కసారిగా పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. ఎక్కువకాలం బాధపడితే ప్రయోజనం లేదని.. బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ పదివేల రూపాయల జీతం. అది కూడా టెలికాం కంపెనీలకు చెందిన కేబులింగ్, మెయింటెనెన్స్ పనులు చేసే సంస్థే. అతి తక్కువ కాలంలోనే.. మేనేజ్‌మెంట్ మనసు దోచాడు. పది రూపాయల్లో అయ్యే పనిని ఏడెనిమిదికి చేసి చూపించి వాళ్లకు నాలుగు రూపాయలు మిగిలేలే చేసేవాడు. ఐదారు నెలలకే జీతం 23 వేలకు పెరిగింది. ఈ లోపు జీవితంలో ఓ తోడు కావాలని వివాహం చేసుకున్నారు. అయితే ఇంట్లో మాత్రం తనకు 16వేలే జీతమని చెప్పారు. ఎందుకంటే.. ఆ ఏడు వేల రూపాయలను దాచి తన సొంత కంపెనీ పెట్టుకోవాలనే ఆలోచన అప్పట్లోనే ఉండేది.
అయితే, ఆ తర్వాత ఈ కంపెనీ వాళ్లు కూడా చెప్పిన జీతం సరైన సమయానికి ఇవ్వకపోవడం.. ఎంత పెద్ద పనిచేసినా.. మెచ్చుకోకపోవడంతో సంతృప్తి లేక ఉద్యోగం మానేశాడు. ఈ లోపు సమర్ధులైన సిబ్బంది లేకపోవడంతో ఓ కాంట్రాక్ట్ పని మధ్యలో ఆగిపోయే స్థాయికి వచ్చింది. అది అండర్‌వాటర్‌లో కేబులింగ్ చేసే పని. ఇందులో ఎంఎంఆర్ దిట్ట. ఎక్కడైతే ఎక్కువ కష్టం ఉంటుందో.. ఎక్కడ నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయో.. ఆ పనులనే ఛాలెంజింగ్‌గా మధు చేసేవారు. చేసేది లేక మళ్లీ మధుని పిలిపించారు. ఈ కాంట్రాక్ట్ మొత్తం తనకే ఇస్తే చేస్తానని ఈసారి ఆయన తెగేసి చెప్పారు. అప్పుడు వాళ్లు అందుకు ఓకె చెప్పడంతో.. మళ్లీ కాంట్రాక్టర్ అవతారమెత్తారు. ఇది లైఫ్‌లో మేజర్ టర్నింగ్ పాయింట్.
సొంత కంపెనీ
ఇలా జీవితం గడిచిపోతే ప్రయోజనం లేదనిపించింది. తన దగ్గరున్న డబ్బు, భార్య తరపు వాళ్ల సహకారంతో మూడు లక్షల వరకూ పోగేశారు. 2005లో మళ్లీ కంపెనీ ప్రారంభించారు. ఇదే మధుసూధన్ రావుకు సెకెండ్ లైఫ్. అప్పటికే అనేక ఆటుపోట్లను ఎదుర్కోవడంతో జీవితానికి సరిపడా అనుభవం సంపాదించేశారు. కుటుంబంలోని వాళ్లకే కొన్ని కీలక బాధ్యతలను అప్పగించారు. బంధువులనే నమ్మారు. ఒక్కో టెలికాం కాంట్రాక్టును కైవసం చేసుకుంటూ పోయారు. ఇప్పుడు ఎంఎంఆర్ గ్రూప్.. 8 వేల కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ కేబులింగ్, 20 వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ మెయింటెనెన్స్ చేసే స్థాయికి ఎదిగింది. టాటా టెలీ, వొడాఫోన్, రైల్‌టెల్, ఎయిర్టెల్, విఎస్ఎన్ఎల్, జిటిఎల్, అమెరికన్ టవర్స్.. ఇలా దేశంలో ఉన్న టాప్ ఎంఎన్‌సి కంపెనీలన్నీ ఇప్పుడు అతని క్లైంట్లు. ఆంధ్ర, తెలంగాణ సహా.. వివిధ రాష్ట్రాల్లో దూసుకుపోయారు. ఒక్క రిలయన్స్, బిఎస్ఎన్ఎల్ మినహా.. దేశంలో ఉన్న అన్ని టెలికాం కంపెనీలకూ.. పనిచేశాడు. అయితే దళిత్ కార్డ్ ఉపయోగించి.. ఈ కాంట్రాక్ట్‌లన్నీ పొందాడని ఎవరైనా అనొచ్చని.. ఇంతవరకూ ఓ ప్రభుత్వ కాంట్రాక్ట్ కూడా చేయలేదు. చేసినవన్నీ పూర్తిగా ప్రైవేట్ సంస్థల పనులే. ఇప్పటికీ రోజుకు 18 గంటలు కష్టపడి చేయడం.. తన తల్లి రాములమ్మని చూసి నేర్చుకున్నట్టు చెప్తారు. చిన్నప్పటి నుంచి తనకు అలవాటు మూడు పూటలా ఉన్నదేదో తినడం అలవాటని..ఇప్పుడు కూడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తానంటూ చెప్పడం అతనిలో ఉన్న ఆ మట్టివాసన పరిమళాన్ని, స్వచ్ఛతను తెలియజేస్తోంది.
ఇప్పుడు 100 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీ
రాజా స్కాం తర్వాత మెల్లిగా టెలికాం రంగంలో జోరు తగ్గడాన్ని గమనించారు. ఇలా ఉంటే.. ప్రయోజనం లేదని.. తన వ్యాపారాన్ని డైవర్సిఫై చేశారు. కన్‌స్ట్రక్షన్, మైనింగ్, పవర్ ప్రాజెక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటి స్టాఫింగ్, ఆగ్రో.. 11 రంగాలకు తన కార్యకలాపాలను విస్తరించారు. 15 కంపెనీలను ఫ్లోట్ చేశారు. రాజమండ్రిలో 50 ఎకరాల్లో టౌన్‌షిప్ నిర్మాణం, చెన్నై మెట్రోలో కొన్ని కీలక పనులు, వైజాగ్‌లో 11 ఎకరాల్లో వెంచర్ నిర్మాణం వంటివి తనకు కన్‌స్ట్రక్షన్ రంగంలోనూ మంచిపేరు తెచ్చాయి. ఈ సంస్థలన్నీ ఇప్పుడు వంద కోట్లకు పైగా టర్నోవర్ చేస్తున్నాయి. త్వరలో దక్షిణాఫ్రికాలో టెలికాం కంపెనీలకు అవసరమైన సేవలను అందించాలని చూస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 3జి నుంచి 4జి కన్వర్షన్ అవుతున్న నేపధ్యంలో దానిపై అధికంగా దృష్టి కేంద్రీకరించారు. పూణెలో ఐటి స్టాఫింగ్ సేవల కంపెనీని ఏర్పాటు చేశారు. ఆరుగురు ఐఐటి విద్యార్థులతో కలిసి ఓ ఐటి ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎంఎంఆర్ గ్రూపులో 300 మంది పనిచేస్తున్నారు. పరోక్షంగా ఇప్పటివరకూ ఓ ఏడెనిమిది వేల మందికి ఉపాధిని చూపించి ఉంటారు. రాబోయే ఐదేళ్లలో తన గ్రూపు టర్నోవర్‌ను ఐదువేల కోట్లకు పెంచాలనేదే తన ఏకైక లక్ష్యం. కనీసం ఐదు వేల మందికి ఉపాధిని చూపించాలనే ఆరాటం.
ఇప్పుడు ఎంఎంఆర్‌కు నలభై ఏళ్లు. మరో ఏడేళ్లలో రిటైర్ అయిపోదామని అనుకుంటారు. అప్పుడు మెంటార్‌గా ఉంటూ.. తన ట్రస్ట్ ద్వారా సేవ చేద్దామనే ఆలోచన ఆయన బలంగా ఉంది. తనలా ఎవరూ తిండికి ఇబ్బంది పడే పరిస్థితి రావొద్దని నిశ్చయించుకున్నారు. పాతికేళ్ల నుంచి కుటుంబంతో సరిగా గడపలేకపోయానని, టెన్షన్లతోనే ఇంతకాలం సాగిపోయిందని.. అప్పుడైనా కాస్త రిలాక్స్‌డ్‌గా ఉందామనేది ఆలోచన. ఈలోపు లక్ష్యాలన్నీ పూర్తిచేసుకోవడం తనముందున్న కర్తవ్యమని చెప్తారు.
తన కోసం కష్టపడిన కుటుంబ సభ్యులందరికీ భూమి, ఇళ్లను కొనిచ్చారు. వాళ్ల పెళ్లిళ్లన్నీ చేశారు. కొంత మందిని కంపెనీలో డైరెక్టర్లుగా చేశారు. ఇప్పుడు మధు అన్న బిఎస్ఎన్ఎల్‌లో జూనియర్ టెలికాం ఆఫీసర్. భార్య కూడా జెటిఓనే. తాను సెటిల్ అయి.. అందరినీ సెటిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.
పూరిగుడిసె నుంచి జూబ్లిహిల్స్
తాపీ పని చేయడానికి జూబ్లిహిల్స్ వచ్చినప్పుడు అక్కడ ఇళ్లను చూసి అతని మది చెదిరిపోయింది. ఒక్కరోజైనా ఇలాంటి ఇళ్లలో పడుకోవాలనే కోరిక బలంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో విశాలమైన, అద్భుతమైన సిటీ వ్యూ కనిపించే ఓ ఖరీదైన ఫ్లాట్‌నే సొంతం చేసుకున్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఏపి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గురించి ‘DEFYING THE ODDS’, ది రైజ్ ఆఫ్ దళిత్ ఆంట్రప్రెన్యూర్స్ అనే పుస్తకంలో ప్రధానంగా ప్రచురించారు. స్వీడిష్ ఆథర్ ‘ఇండియా అవేక్స్’ పేరుతో ముగ్గురు అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులపై డాక్యుమెంటరీ రూపొందించారు. వాళ్లలో ఎంఎంఆర్ కూడా ఒకరు. ఇప్పటివరకూ ప్రముఖమైన విదేశీ పత్రికలు ఎన్నో ఇతని సక్సెస్ స్టోరీని ప్రచురించాయి. ఆశ్చర్యకరంగా తెలుగు వారెవరికీ మధుసూధన్ రావు గురించి పెద్దగా తెలియదు. మొట్టమొదటి సారి యువర్ స్టోరీ ఈ స్ఫూర్తిదాయకమైన కథనాన్ని మీ అందరికీ పరిచయం చేస్తోంది.
నేను విద్యార్థులకు చెప్పేది ఒక్కటే.. మీ ఊరు కానప్పుడు.. ఏ ఊరైనా మీకు ఒక్కటే. ప్రపంచంలో ఎక్కడైనా వెళ్లి పనిచేయండి. అవకాశం మీ దగ్గరికి ఎప్పుడూ రాదు. మీరే అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్లండి. ఏదైనా కంపెనీ పెట్టేముందు ఆ రంగంలో కనీసం ఏడాదిపాటు ఉద్యోగిగా పనిచేసి అనుభవం పొందండి. మీ కంపెనీలో ప్రతీ పనీ మీకు వచ్చి ఉండాలి.